Chigurupati Jayaram: మొన్న 'ఎవరిపైనా అనుమానం లేదు'... నిన్న 'శిఖా చౌదరి పనే'... మాట మార్చిన పద్మశ్రీ!

  • శిఖా ప్రమేయం లేదన్న ఏపీ పోలీసులు
  • ఆమెపైనే అనుమానమన్న పద్మశ్రీ
  • చర్చనీయాంశమైన పద్మశ్రీ వ్యాఖ్యలు
తన భర్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ఆయన భార్య పద్మశ్రీ మీడియా ముందు రెండు రకాలుగా మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భర్త హత్య విషయం తెలుసుకున్న అనంతరం విదేశాల నుంచి వచ్చిన ఆమె, మొన్న తన భర్త మరణంపై తనకు ఎవరిపైనా అనుమానాలు లేవని వెల్లడించిన సంగతి తెలిసిందే. పద్మశ్రీ ఈ విషయాన్ని మీడియా ముందు చెప్పే సమయానికే జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి, రాకేశ్ రెడ్డిలు నందిగామ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసును పోలీసులు విచారించి, నిందితులను బయటకు లాక్కొస్తారన్న నమ్మకం తనకుందని కూడా రెండు రోజుల క్రితం పద్మశ్రీ వ్యాఖ్యానించారు.

అయితే, 24 గంటలు గడవకుండానే ఆమె వైఖరి మారిపోయింది. ఎప్పుడైతే ఈ కేసులో శిఖా ప్రమేయం లేదని ఏపీ పోలీసులు వెల్లడించారో, ఆ వెంటనే ఆమె జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన భర్త హత్య హైదరాబాద్ లో జరిగిందని గుర్తు చేస్తూ, ఏపీ పోలీసులు కేసును తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. తన భర్త సొంత సోదరి నుంచే ప్రాణహాని ఉందని తనకు చెప్పేవారని, ఈ కేసులో అసలు నిందితులను ఏపీ పోలీసులు రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేసు వెనుక తనకు శిఖా చౌదరిపై అనుమానం ఉందని చెప్పారు. దీంతో ఆమె ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి.
Chigurupati Jayaram
Murder
Police
Andhra Pradesh
Telangana
Padmasri

More Telugu News