Chigurupati Jayaram: మరో కోణం... జయరామ్ హత్య తరువాత పోలీసుల సాయం!

  • మృతదేహాన్ని తెలంగాణ దాటించాలని సలహా
  • సూచనలు ఇచ్చిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు
  • హైదరాబాద్ కమిషనర్ కు నందిగామ పోలీసుల ఫిర్యాదు
గంటకో మలుపు తిరుగుతున్న ఎన్నారై, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. జయరామ్ ను హత్య చేసిన తరువాత, మృతదేహాన్ని తెలంగాణ దాటించేందుకు హైదరాబాద్ కు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు సలహాలు, సూచనలు ఇచ్చారని, వారిచ్చిన సూచనలతోనే, తాను రాత్రిపూట కారులో జయరామ్ మృతదేహంతో నందిగామ చేరుకున్నానని పోలీసుల విచారణలో రాకేశ్ రెడ్డి వెల్లడించినట్టు సమాచారం.

దీంతో వారిద్దరిపైనా హైదరాబాద్ కమిషనర్ కు నందిగామ పోలీసులు ఫిర్యాదు చేశారు. జయరామ్ మృతదేహాన్ని ఎలా తరలించాలన్న విషయమై వారు పలుమార్లు రాకేశ్ తో మాట్లాడారని, రాకేశ్ ఫోన్ లో వారి నంబర్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ కేసులో వారిని ప్రశ్నించాల్సి వుందని స్పష్టం చేశారు. కాగా, గత రాత్రి శిఖా, రాకేశ్ లను ఎదురెదురుగా కూర్చోబెట్టి, పలు పాత విషయాలపై కూపీ లాగిన పోలీసులు, హత్య తరువాత ఆ విషయాన్ని శిఖాకు రాకేశ్ చెప్పాడని కూడా తేల్చారు. ఆ తరువాతే శిఖాను రహస్యంగా మరో ప్రాంతానికి తరలించారు.

కాగా, నేటి మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి, హత్యోదంతాన్ని వెల్లడిస్తామని చెప్పిన నందిగామ పోలీసులు, మీడియా సమావేశాన్ని సాయంత్రానికి వాయిదా వేయడం గమనార్హం.
Chigurupati Jayaram
Murder
Rakesh
Hyderabad
Police
Nandigama

More Telugu News