Jayaram: జయరామ్ హత్య కేసులో మరో మలుపు... కారులో యువతి ఉన్నట్టు అనుమానం!

  • ప్రత్యేక బృందాలతో విచారణ వేగవంతం
  • హత్యకు కొద్దిసేపటి ముందు కారులో ముగ్గురు
  • అన్ని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్న పోలీసులు
పెను సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఆయన్ను హత్య చేశారని ఇప్పటికే తేల్చిన పోలీసులు, కారులో ఎవరెవరు ఉన్నారన్న విషయమై ప్రత్యేక బృందాలను పెట్టి విచారణ జరిపిస్తున్నారు. ఓ బృందం హైదరాబాద్ లోని ఆయన ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తుండగా, మరో బృందం హత్య జరిగిన ప్రాంతంలో విచారణ కొనసాగిస్తోంది. ముగ్గురిని రహస్య ప్రదేశాల్లో విచారిస్తున్నారు. జయరామ్ సమీప బంధువైన మహిళను నందిగామకు తీసుకు వచ్చి ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడు తాజాగా, ఆయన కారులో ఓ యువతి కూడా ప్రయాణించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో జయరామ్ తో పాటు మరొకరు లేదా ఇద్దరు ఉన్నారన్న నిర్ధారణకు వచ్చిన పోలీసులు, వారు ఎవరన్న విషయమై ఆరా తీస్తున్నారు. టోల్ గేట్ల వద్ద లభించిన సీసీటీవీ ఫుటేజ్ లో జయరామ్ వాహనాన్ని నడపడం లేదు. వెనుక ఇద్దరు ఉన్నట్టు మసకగా తెలుస్తోంది. దీంతో జాతీయ రహదారిపై ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలనూ పరిశీలిస్తున్నామని, సాయంత్రానికి కీలక ఆధారాలు లభ్యమవుతాయని పోలీసులు అంటున్నారు. కాగా, ప్రస్తుతం జయరామ్ మృతదేహం హైదరాబాద్ కు చేర్చగా, విదేశాల్లో ఉన్న ఆయన భార్య, పిల్లలు వచ్చిన తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు. 
Jayaram
Murder
Car
Police
Lady

More Telugu News