Odisha: గొడ్డలితో నరికి చంపి.. కారణాన్ని గోడమీద రాసివెళ్లిన హంతకుడు

  • మద్యం తాగొద్దన్నందుకు యజమానిపై కక్ష
  • అదనుకోసం ఎదురుచూసి హత్య
  • నిందితుడి కోసం పోలీసుల గాలింపు
మద్యం తాగొద్దన్నందుకు కక్ష పెంచుకుని, యజమానిని దారుణంగా హత్య చేశాడో యువకుడు. ఒడిశాలోని ఖుర్దా జిల్లా సిమోరో గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సత్యబ్రత (35) ఇల్లు కట్టుకున్నాడు. దానికి రంగులు వేయించేందుకు ఇంటి పనిచేసే యువకుడు నరేంద్రతో కలిసి వెళ్లి వాటిని కొనుక్కొచ్చాడు.

నరేంద్రకు మద్యం తాగే అలవాటు ఉండడంతో దానిని మానేయాల్సిందిగా సత్యబ్రత పలుమార్లు కోపగించుకున్నాడు. అయినప్పటికీ వినకపోవడంతో చేయి కూడా చేసుకున్నాడు. దీంతో కక్ష పెంచుకున్న నరేంద్ర మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న గొడ్డలితో యజమాని సత్యబ్రతను దారుణంగా నరికి చంపాడు. అనంతరం ఇంటి గోడపై తానెందుకు అతడిని చంపిందీ రాశాడు. మద్యం తాగకుండా అడ్డుపడుతున్నందుకే సత్యబ్రతను హత్య చేసినట్టు రాసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Odisha
Murder
Khurda
Axe
Police
Crime News

More Telugu News