Chandrababu: శ్రీవారి ఆశీస్సులతో అమరావతి నుంచి ముందుకు పోదాం: సీఎం చంద్రబాబు

  • స్వామివారు రాష్ట్రంలో కొలువై ఉండడం మన అదృష్టమని వ్యాఖ్య
  • ఆలయ నిర్మాణానికి భూకర్షణ, బీజావాపనం
  • ఆగమోక్తంగా వైదిక క్రతువు నిర్వహణ
కలియుగ దైవం వేంకటేశ్వరుడు నవ్యాంధ్ర ప్రాంతంలోని తిరుమల గిరులపై కొలువు దీరి ఉండడం ఆంధ్ర ప్రజల అదృష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని, ఆయన ఆశీస్సులతో అమరావతి నుంచి ముందుకు పోదామని చెప్పారు.

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో స్వామి వారి ఆలయ నిర్మాణంలో భాగంగా నేడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆగమోక్తంగా వైదిక క్రతువును, భూకర్షణ, బీజావాపనం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి రెండు సార్లు రాజధానిగా వెలుగొందిందన్నారు. రాష్ట్ర విభజన కారణంగా అన్నీ పోయినా వేంకటేశ్వరుడు ఉన్నాడన్న ధైర్యంతోనే ముందుకు వెళ్లానని తెలిపారు. వేంకటేశ్వరుడు తమ ఇంటి కులదైవమని, అలిపిరి ఘటన నుంచి బయటపడి ఈరోజు మీ ముందుండగలిగానంటే అదంతా శ్రీవారి దయేనన్నారు.

తన చేతుల మీదుగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలని రాసిపెట్టి ఉండడం అదృష్టమన్నారు. ఎన్నిసార్లు వెళ్లినా తిరుమల మళ్లీ మళ్లీ వెళ్లాలనిపిస్తుందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులు, ముఖ్యమైన పట్టణాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ కృషి చేయాలని సూచించారు. కష్టపడి పనిచేసే వారికి స్వామివారి అనుగ్రహం ఉంటుందన్నారు.
Chandrababu
tulluru
srivari temple

More Telugu News