jcb: మధ్యప్రదేశ్ లో 70 అడుగుల బోరు బావిలో పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు అధికారుల సహాయక చర్యలు!

  • మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీ జిల్లాలో ఘటన
  • బావిలోకి ఆక్సీజన్ ను పంపిస్తున్న అధికారులు
  • సమాంతరంగా జేసీబీతో తవ్వకాలు
మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీ జిల్లాలో ఓ చిన్నారి బోరు బావిలో పడిపోయాడు. జిల్లాలోని కెర్హర్ గ్రామానికి చెందిన రెండేళ్ల బాలుడు ఈరోజు ఉదయం ఆడుకుంటూ పొరపాటున ఇంటికి సమీపంలో 70 అడుగుల లోతు ఉన్న బోరు బావిలో పడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు విపత్తు నిర్వహణ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు పక్కనే జేసీబీతో సమాంతరంగా తవ్వకాలను మొదలుపెట్టారు.

అలాగే బాలుడికి ఊపిరి అందేలా బోరు బావిలోకి ఆక్సిజన్ ను పంపుతున్నారు. చిన్నారి సజీవంగానే ఉన్నట్లు గుర్తించిన అధికారులు సహాయక చర్యలను తీవ్రతరం చేశారు. మరోవైపు బాలుడు బోరు బావిలో చిక్కుకోవడంతో అతని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. కాగా, నిబంధనల మేరకు బోరుబావిని మూసేయకుండా వదిలేసిన యజమానిపై కేసు నమోదు చేసేందుకు పోలీస్ అధికారులు సిద్ధం అవుతున్నారు.
jcb
kid
trapped
in
bore well
Police
disaster team

More Telugu News