Tamil Nadu: జయలలిత మృతి కేసు విచారణ: ఫిబ్రవరి 24వ తేదీలోగా నివేదిక?

  • జస్టిస్‌ ఆర్ముగం కమిషన్‌ నిర్ణయం
  • లాయర్ల ద్వారా వివరాలు అందుతున్నాయన్న కమిషన్‌
  • ఫిబ్రవరి 24లోగా నివేదిక దాఖలుకు సన్నాహాలు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఆర్ముగం కమిషన్‌ శశికళను ప్రత్యక్ష విచారణ నుంచి మినహాయించినట్టు సమాచారం. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన జయలలిత మృతిపై పలు అనుమానాలు రేకెత్తిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిషన్‌ ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జయలలిత, శశికళ బంధువులు, పోయెస్‌గార్డెన్‌లోని పనిమనుషులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, అపోలో వైద్యులు, నర్సులు, ఎయిమ్స్‌ వైద్యులు వంటి 140 మందికి పైగా వ్యక్తులను విచారించింది.

ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న జయలలిత స్నేహితురాలు శశికళను కూడా విచారించాల్సి ఉన్నప్పటికీ, ఆమెకు సంబంధించిన వివరణను ఆమె న్యాయవాదులు ఎప్పటికప్పుడు కమిషన్‌కు తెలియజేస్తున్నందున ప్రత్యక్షంగా ఆమెను విచారించాల్సిన అవసరం లేదని కమిషన్‌ నిర్ణయించినట్లు సమాచారం.

ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంతో కేసు విచారణ ముగించాలని కమిషన్‌ తొలుత నిర్ణయించినా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో వాటిని పరిష్కరించి ఫిబ్రవరి 24వ తేదీలోగా తన నివేదిక సమర్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Tamil Nadu
jayallitha
sasikala
armugam commission

More Telugu News