Jagan: అవును.. జగన్ నేరాలను కాపీ కొట్టడం ఎవ్వరి తరం కాదు!: యనమల సెటైర్లు

  • అవినీతి కుంభకోణాలే వైసీపీ నవరత్నాలు
  • వాన్ పిక్, వోక్స్ వ్యాగన్ వాటిలో భాగమే
  • కాపు రిజర్వేషన్లపై వైసీపీ విమర్శిస్తోంది
చంద్రబాబు సర్కారు తాము ప్రకటించిన నవరత్నాలను కాపీ కొడుతోందని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విమర్శలపై ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. అవినీతి కుంభకోణాలే వైసీపీ అధినేత జగన్ నవరత్నాలని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ నేరాలను కాపీ కొట్టడం ఎవ్వరి తరం కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ ప్రకటించింది నవరత్నాలు కాదనీ, అష్టావక్ర దోపిడీలని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో యనమల మాట్లాడారు.

ఎమ్మార్ కుంభకోణం ఓ రత్నం అయితే, టైటానియం కుంభకోణం జగన్ ఖాతాలో మరో రత్నమని ఆయన దుయ్యబట్టారు. అలాగే వోక్స్ వ్యాగన్ కుంభకోణం, మద్యం కుంభకోణం, ముగ్గురాయి కుంభకోణం, బాక్సైట్ కుంభకోణం, ఇనుప ఖనిజం, వాన్ పిక్, లేపాక్షి కుంభకోణాలు జగన్ ఖాతాలోని రత్నాలేనని సెటైర్ వేశారు.

జగన్ కుంభకోణాలకు అంతే లేదని వ్యాఖ్యానించారు. రూ.లక్ష కోట్ల అవినీతి, 13 చార్జిషీట్లు, 16 నెలల జైలు తప్ప జగన్ సాధించింది ఏముందని ప్రశ్నించారు. పేదలకు పింఛన్లను పెంచడం, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వైసీపీ విమర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం కోసం టీడీపీ పనిచేస్తే, ప్రజాధనం దోపీడీకి వైసీపీ ఉందని అన్నారు. నిర్మాణానికి టీడీపీ నిదర్శనమైతే, విధ్వంసానికి వైసీపీ నిదర్శనమని వ్యాఖ్యానించారు.
Jagan
YSRCP
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Yanamala
SCAMS
NAVARATNALU
criticise
allegation

More Telugu News