Andhra Pradesh: టీడీపీ నుంచి ‘మేడా’ మాత్రమే కాదు.. ఇంకా చాలామంది బయటకు వస్తారు!:బొత్స కీలక వ్యాఖ్యలు

  • టీడీపీ నేతలు పంచభూతాలను దోచుకున్నారు
  • కాపు రిజర్వేషన్ పై అబద్ధాలు చెబుతున్నారు
  • టీడీపీ అధినేతపై వైసీపీ నేత విమర్శలు
ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమం సన్నగిల్లిపోయాయని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. టీడీపీ పగలు కాంగ్రెస్ తో, రాత్రి బీజేపీతో చేతులు కలుపుతోందని దుయ్యబట్టారు. కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తే దాంట్లో 5 శాతం తాను కాపులకు ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఏపీలో టీడీపీ త్వరలోనే ఖాళీ అయిపోతుందని బొత్స జోస్యం చెప్పారు. ఏపీ ప్రజలంతా వైసీపీ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు తమ మోసాలు, మాయలు కట్టిపెట్టాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. సామాన్యులకు న్యాయం చేయాలన్న తపన, కోరిక టీడీపీ నేతలకు లేవన్నారు. జగన్ ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు కాపీ కొట్టారని విమర్శించారు.

చంద్రబాబు అమలు చేసినా, చేయకపోయినా వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పథకాలను అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు. కేవలం మేడా మల్లికార్జున రెడ్డి మాత్రమే కాదనీ ఇంకా చాలామంది టీడీపీ నుంచి బయటకు వస్తారని వ్యాఖ్యానించారు. ఏపీ అప్పులను చంద్రబాబు రూ.90,000 కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లకు తీసుకెళ్లారని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు పంచభూతాలను పంచుకుని తిన్నారని ఆరోపించారు. తాను ఏది చేసినా ప్రజలు నమ్మేస్తారన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారనీ, అందుకే తాజాగా కాపుల రిజర్వేషన్ పై అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Telugudesam
YSRCP
Botsa Satyanarayana
satyanarayana
kapu reservation

More Telugu News