Andhra Pradesh: దోపిడీ దొంగల రాక్షసత్వం.. ఇంటిలో గ్యాస్ సిలిండర్ లీక్ చేసి మంటపెట్టిన దుండగులు!

  • తీవ్రంగా గాయపడ్డ మహిళ
  • బాధితురాలు గుంటూరు ఆసుపత్రికి తరలింపు
  • కేసు నమోదుచేసిన పోలీస్ అధికారులు
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో మహిళ నుంచి బంగారు నగలను చోరీ చేసిన కొందరు దొంగలు.. సాక్ష్యాలు మిగలకుండా గ్యాస్ సిలిండర్ లీక్ చేసి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఇంటి మహిళ తీవ్రంగా గాయపడింది. జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామంలో ఒంటరిగా ఓ మహిళ ఉంటోంది.

ఈ నేపథ్యంలో ఆమె ఇంటిపై కన్నేసిన కొందరు దుండగులు ఈరోజు తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం నిద్రపోతున్న మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసులతో పాటు ఇంట్లోని నగలు, నగదును దోచుకున్నారు. ఆ తర్వాత వంటింటిలోని గ్యాస్ సిలిండర్ ను లీక్ చేసి మంట పెట్టి పరారయ్యారు.

ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో బాధితురాలు ఆర్తనాదాలు చేస్తూ బయటకు పరుగెత్తింది. దీంతో స్థానికులు ఆమెను వెంటనే గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. ఈ సందర్భంగా బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకున్నపోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక టీమ్ లను రంగంలోకి దించామన్నారు. మరోవైపు జీజీహెచ్ ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ.. బాధితురాలి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని పేర్కొన్నారు.
Andhra Pradesh
Guntur District
Police
GAS
CYLANDER
FLAME
thieves
robbery

More Telugu News