KCR: కేసీఆర్ సహస్ర చండీయాగానికి వైఎస్ జగన్‌?

  • ఈ నెల 21 నుంచి 25 వరకు యాగం
  • గతంలో అయుత చండీయాగానికి హాజరైన చంద్రబాబు
  • ఈసారి చంద్రబాబుకు అందని ఆహ్వానం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనూహ్యంగా మిత్రుడిగా మారిన ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఫెడరల్ ఫ్రంట్‌లో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే విజయవాడ వెళ్లనున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లోకి జగన్‌ను ఆహ్వానించనున్నట్టు జగన్-కేటీఆర్ భేటీ అనంతరం కేటీఆర్ తెలిపారు.  కాగా, కేసీఆర్ త్వరలో నిర్వహించనున్న సహస్ర చండీయాగానికి జగన్‌ను కేటీఆర్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

ఈ నెల 21 నుంచి 25 వరకు తన ఫాం హౌస్‌లో కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన యాగానికి జగన్ హాజరు కానున్నట్టు సమాచారం. గతంలో కేసీఆర్ నిర్వహించిన అయుత చండీయాగానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో హాజరయ్యారు. అయితే, ఈసారి చంద్రబాబుకు ఆహ్వానం అందలేదని సమాచారం. తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల సందర్భంగా చంద్రబాబు-కేసీఆర్ మధ్య దూరం పెరగడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. మరోవైపు, ఈ యాగానికి హాజరుకావడం ద్వారా కేసీఆర్‌తో తన మైత్రీ బంధాన్ని మరింత పెంచుకోవాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
KCR
Jagan
YSRCP
TRS
Telangana
Andhra Pradesh
Chandrababu

More Telugu News