Hyderabad: భార్యపై అనుమానం.. సంక్రాంతి నాడు గొంతు నులిమి చంపేసిన భర్త

  • మద్యానికి బానిసై భార్యకు తరచూ వేధింపులు
  • పోలీసుల కౌన్సెలింగ్ తోనూ మారని ప్రవర్తన
  • హత్య తరువాత ఇంట్లోని డబ్బులతో పరారీ
భార్యపై అనుమానం పెంచుకుని నిత్యం వేధిస్తున్న ఓ భర్త సంక్రాంతి నాడు ఆమె గొంతు నులిమి చంపేశాడు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లికి చెందిన రాము (30) పదేళ్ల క్రితం సరూర్‌నగర్‌ డివిజన్‌లోని భగత్‌సింగ్‌నగర్‌కు వలస వచ్చాడు. ఆటో నడుపుతూ జీవిస్తున్న అతడికి తొమ్మిదేళ్ల క్రితం భగత్‌సింగ్ నగర్‌కే చెందిన శ్వేత (26)తో వివాహమైంది. వీరికి 3 నుంచి 8 ఏళ్ల వయసున్న ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి ఉన్నారు.

మద్యానికి పూర్తిగా బానిసైన రాము.. భార్యను తరచూ వేధించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు భరించలేని ఆమె రెండేళ్ల క్రితం సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాకపోగా ఇటీవల భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు. సంక్రాంతి పండుగ రోజున రాత్రి ఫుల్లుగా తాగొచ్చిన రాము భార్య గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఇంట్లో ఉన్న రూ. 15 వేలను పట్టుకుని పరారయ్యాడు.

ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉన్నా అలికిడి లేకపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లి చూడగా శ్వేత మృతి చెంది కనిపించింది. ఆమె తండ్రి నారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Hyderabad
Saroornagar
Crime News
Police
Telangana

More Telugu News