Andhra Pradesh: ఇంటికి వెళ్లకుండా నేను 208 రోజులు పాదయాత్ర చేశా.. జగన్ చేసింది విలాస యాత్రే!: ఏపీ సీఎం చంద్రబాబు సెటైర్లు

  • పాదయాత్ర పవిత్రతను జగన్ దెబ్బతీశారు
  • జగన్-కేసీఆర్ లాలూజీ పడ్డారు
  • ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహణపై టెలీకాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం విజయవంతమయిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ నెల 18న ఎన్టీఆర్ 23వ వర్ధంతి నిర్వహణపై సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలనీ, లెజండరీ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

ఇంటికి వెళ్లకుండా తానూ 208 రోజులు పాదయాత్ర చేశానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. జగన్ చేపట్టింది పాదయాత్ర కాదనీ, అది విలాస యాత్ర అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాదయాత్ర పవిత్రతనే జగన్ దెబ్బతీశారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి ఏపీకి ప్రత్యేకహోదా తెస్తానని జగన్ చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. వైసీపీ-టీఆర్ఎస్ లాలూజీ పడ్డారని చెప్పడానికి ఇదే రుజువన్నారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై జగన్ ఏనాడూ మాట్లాడలేదని టీడీపీ అధినేత విమర్శించారు. ప్రధాని మోదీకి భయపడేవాడు ఏపీకి న్యాయం చేస్తాడా?అని ప్రశ్నించారు. ఓట్ల కోసమే ప్రధాని మోదీ అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లును తెచ్చారని చంద్రబాబు ఆరోపించారు. కాపులు, ముస్లింల రిజర్వేషన్ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేదని నిలదీశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) పనితీరుపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Chandrababu
Chief Minister
Jagan
YSRCP
ntr

More Telugu News