Chittoor District: ఆమె ‘కొలువుల’ సరస్వతి.. పాతికేళ్లకే నాలుగు పెద్ద ఉద్యోగాలు!

  • అన్నీ ఇంజనీరింగ్‌ అధికారి స్థాయివే
  • ఎంటెక్‌ పూర్తికాగానే వచ్చి పడుతున్న అవకాశాలు
  • కూతురి ప్రతిభ చూసి ఉబ్బి తబ్బిబ్బవుతున్న తల్లిదండ్రులు
ఆమె పేరు శిరీష. వయసు పాతికేళ్లు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపాలిటీలో పర్యావరణ విభాగం అసిస్టెంట్‌ ఇంజనీర్‌. ఇందులో విశేషం ఏముందనుకుంటున్నారా? ఈ ఉద్యోగమే కాదు మరో మూడు పెద్ద ఉద్యోగాలు ఆమెను వరించాయి. అన్నీ అధికారి హోదావే. వివరాలు తెలుసుకోవాలని ఉందా. అయితే చదవండి...మదనపల్లెలోని మిట్టపల్లెకు చెందిన శిరీష 2017లో ఎంటెక్‌ పూర్తిచేశారు. చదువు పూర్తికాగానే ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం మొదలుపెట్టింది. ఈమె తండ్రి రమణ వ్యవసాయదారుడు కాగా, తల్లి సావిత్రి  నిమ్మనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నారు. తమ బిడ్డ బాగా చదివి ఉన్నతోద్యోగం చేయాలని ఆశించి కష్టపడి చదివించారు.

తల్లిదండ్రుల ఆశలను శిరీష వమ్ము చేయలేదు. ఇంజనీరింగ్‌ విద్యను పూర్తిచేసి ఉద్యోగాల్లోనూ సత్తాచాటింది. తొలుత భూగర్భ జలశాఖలో జిల్లా హైడ్రాలజిస్ట్‌ ఉద్యోగం వరించింది. గత ఏడాది ఆగస్టులో విధుల్లో చేరిన శిరీష నెలరోజులు పూర్తి చేయకముందే పర్యావరణ శాఖలో ఏఈ ఉద్యోగం ఆమెను వరించింది. ప్రజలకు సేవచేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో హైడ్రాలజిస్ట్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రస్తుతం పర్యావరణ విభాగంలో ఏఈగా సేవలందిస్తున్నారు. తాజాగా జెన్‌కో, ఆర్‌అండ్‌బీ విభాగాల్లో ఏఈ ఉద్యోగాలు కూడా వరించాయి. అంతేకాదండోయ్‌...20 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీతో ఎల్‌అండ్‌టీలో ఉద్యోగం కూడా శిరీషను వరించింది.

ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ డబ్బు కంటే ప్రజలకు సేవ చేయడంలోనే తృప్తి ఉంటుందన్నారు. అందుకే భారీ ప్యాకేజీ అయినా ఎల్‌అండ్‌టీ ఉద్యోగం వదులుకున్నట్లు తెలిపారు. ‘ఓసారి నాన్న నన్ను మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఓ చాంబర్‌ చూపించి ఇలాంటి చోట నువ్వు అధికారివై ప్రజలకు సేవ చేస్తే చూడాలని ఉంది అన్నారు. ఆ మాటలు నాలో బలంగా ముద్రవేశాయి. మొదటి నుంచి నాన్నే నాకు స్ఫూర్తి. ఆయన కోరుకున్నట్టే అధికారిని కాగలిగాను’ అని శిరీష తెలిపారు. సివిల్స్‌ సాధించాలన్నది తన లక్ష్యమని, కనీసం గ్రూప్‌ వన్‌ అధికారిగానైనా ఎంపికై జిల్లా ప్రజలకు సేవచేయాలన్నది తన కోరికని శిరీష చెబుతున్నారు. శిరీష సోదరి కూడా బీటెక్‌ పూర్తిచేసి గ్రూప్స్‌కు సిద్ధమవుతున్నారు.
Chittoor District
madanapalli
girl talent

More Telugu News