గతంలో అమిత్ షా, పవన్, జగన్ లపై హత్యాయత్నం జరిగింది.. ఈరోజు నాపై జరిగింది: కన్నా లక్ష్మీనారాయణ
- ఫినిష్ చేస్తానంటూ ఓ మహిళకు సీఎం వార్నింగ్ ఇచ్చారు
- బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు
- చంద్రబాబు, లోకేష్ ల ఆదేశాలతో నన్ను చంపేందుకు యత్నిస్తున్నారు
ఈ ఘటన అనంతరం కన్నా మాట్లాడుతూ, నిన్న కాకినాడ పర్యటనలో చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు తమ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారని చెప్పారు. వారి విన్నపాలను ముఖ్యమంత్రి పట్టించుకోకపోగా... బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. నడిరోడ్డు మీదే ఓ మహిళను ఫినిష్ చేస్తానంటూ సీఎం వార్నింగ్ ఇచ్చారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ ల ఆదేశాల మేరకే తనను చంపేందుకు టీడీపీ శ్రేణులు యత్నిస్తున్నాయని చెప్పారు. ఈ విషయంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, జనసేనాని పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ లపై హత్యాయత్నం జరిగిందని... ఇప్పుడు తనపై జరిగిందని చెప్పారు. ఈ ఘటనలపై గవర్నర్ నరసింహన్ దృష్టి సారించాలని... రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని కోరారు.