Andhra Pradesh: ఆర్థిక కష్టాలతో విలవిల.. ఇద్దరు చిన్నారులతో కలిసి పురుగుల మందు తాగిన కుటుంబం!

  • తండ్రి, ఇద్దరు చిన్నారుల మృతి 
  • కొన ప్రాణాలతో చికిత్స పొందుతున్న తల్లి
  • ఏపీలోని విశాఖ జిల్లాలో దారుణం
ఆర్థిక కష్టాలతో ఓ కుటుంబం చితికి పోయింది. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించేందుకు మార్గం లేకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తండ్రితో పాటు ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, తల్లి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ఈరోజు చోటుచేసుకుంది.

విశాఖలోని కే. కోటపాడు మండలం చంద్రయ్యపేటకు చెందిన లక్ష్మణరావు విశాఖపట్నంలో కోళ్లఫారంలో పనిచేసేందుకు వచ్చారు. లక్ష్మణరావుకు భార్య లక్ష్మితో పాటు సిద్ధూ(6), వీణ(3) ఉన్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మణరావు కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. తీసుకున్న అప్పులను తీర్చేందుకు వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు.

ఆత్మహత్య చేసుకోవాలని వీరు నిర్ణయించుకున్నారు. అనంతరం భార్య లక్ష్మితో కలిసి చిన్నారులకు పురుగుల మందు తాగించాడు. ఆ తర్వాత భార్యతో కలిసి తానూ తాగాడు. కాగా, ఈ ఘటనలో లక్ష్మణరావుతో పాటు ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే కొనప్రాణాలతో వున్న లక్ష్మిని గుర్తించిన స్థానికులు వెంటనే అంబులెన్సులో కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు తెలిపారు.
Andhra Pradesh
suicide
family
financial trouble
pesticide

More Telugu News