Maharashtra: అహ్మద్‌నగర్‌ మేయర్ ఎన్నికల్లో శివసేనకు బీజేపీ ఝలక్!

  • మహారాష్ట్రలో చిరకాల భాగస్వామి శివసేనకు షాక్
  • ఎన్సీపీతో చేతులు కలిపిన కమలనాథులు
  • మేయర్‌ పీఠాన్ని దక్కించుకున్న బీజేపీ
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ నగర మేయర్ ఎన్నికల్లో కమలనాథులు శివసేనకు ఝలక్ ఇచ్చారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)తో చేతులు కలిపి మహారాష్ట్రంలో తమ చిరకాల మిత్రపక్షం శివసేనకు బీజేపీ షాక్ ఇచ్చి, మేయర్‌ పీఠాన్ని సొంతం చేసుకుంది. దీంతో అత్యధిక స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా శివసేనకు నిరాశ తప్పలేదు.

వివరాల్లోకి వెళితే...ఈనెల 10వ తేదీన వెలువడిన అహ్మద్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో శివసేన 24, బీజేపీ 18, ఎన్సీపీ 14 స్థానాల్లో విజయం సాధించాయి. అతిపెద్ద పార్టీగా శివసేన ఆవిర్భవించినప్పటికీ మెజార్టీ స్థానాలకు దూరమయింది. దీంతో శివసేనకు మేయర్‌ పీఠం దక్కకుండా బీజేపీ, ఎన్సీపీలు పావులు కదిపాయి. రెండు పార్టీల కార్పొరేటర్లు చేతులు కలపడంతో బీజేపీ మేయర్‌ పీఠం కోసం పోటీపడింది.

దీంతో బీజేపీకి చెందిన బాబాసాహెబ్‌ వాకలే మొత్తం 37 మంది సభ్యుల మద్దతుతో మేయర్‌ పీఠాన్ని దక్కించుకున్నారు. మహారాష్ట్రలో కమలనాథులు అధికారంలో ఉండగా, శివసేన అక్కడ భాగస్వామ్య పక్షంగా ఉంది. కానీ శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే మిత్రధర్మాన్ని పక్కనపెట్టి పదేపదే ప్రధాని మోదీపై విమర్శలు గుప్పిస్తుండడంతో కమనాథులు వ్యూహం మార్చారు. అహ్మద్‌ నగర్ మేయర్‌ ఎన్నికల రూపంలో అవకాశం రావడంతో శివసేకు ఝలక్‌ ఇచ్చారు.
Maharashtra
ahmednagar
BJP
sivasena
NCP

More Telugu News