ramgopal varma: 48 గంటల్లోగా కేసును వెనక్కి తీసుకో.. బహిరంగంగా క్షమాపణ చెప్పు!: టీడీపీ నేతకు వర్మ లీగల్ నోటీసు

  • వర్మపై ఫిర్యాదు చేసిన ఎస్వీ మోహన్ రెడ్డి
  • లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై అభ్యంతరం
  • కౌంటర్ గా లీగల్ నోటీసు పంపిన దర్శకుడు
రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలోని వెన్నుపోటు పాట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కించపరిచేలా ఉందంటూ ఆ పార్టీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆయనపై పరువునష్టంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా దీనికి రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు. ఎస్వీ మోహన్ రెడ్డికి తన న్యాయవాది ప్రభాకర్ ద్వారా లీగల్ నోటీసులు పంపించారు.

పరువునష్టం కేసును కేవలం సంబంధిత వ్యక్తి మాత్రమే దాఖలు చేయగలరనీ, పక్కనవాళ్లు చేయలేరని వర్మ లాయర్ నోటీసులో తెలిపారు. అంటే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రమే తన క్లయింట్ పై పరువునష్టం కేసు పెట్టగలరని వ్యాఖ్యానించారు. ఈ కేసు నిలబడదని తెలిసినప్పటికీ, ఎస్వీ మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా కర్నూలు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఇది చట్ట ప్రకారం నేరమని గుర్తుచేశారు.

వర్మ తెలుగు, హిందీ సహా పలు భాషల్లో 50పైకి పైగా సినిమాలు తీశారని తెలిపారు. మోహన్ రెడ్డి ఫిర్యాదుతో తన క్లయింట్ రామ్ గోపాల్ వర్మ పరువుప్రతిష్ఠలకు భంగం కలిగిందన్నారు. ఈ విషయంలో నోటీస్ అందుకున్న 48 గంటల్లోగా మోహన్ రెడ్డి తాను పెట్టిన పోలీస్ కేసును విత్ డ్రా చేసుకోవడంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆ తర్వాత తీసుకోబోయే సివిల్, క్రిమినల్ చర్యలకు ఆయనే స్వయంగా బాధ్యులు అవుతారని హెచ్చరించారు. ఈ విషయాన్ని వర్మ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
ramgopal varma
Tollywood
say sorry
48 hours legal notice
Telugudesam
sv moahn reddy
lakshmies ntr
Kurnool District
Andhra Pradesh
Telangana

More Telugu News