Khammam District: పార్టీ మారడంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు : టీడీపీ పెద్దలకు స్పష్టం చేసిన సండ్ర

  • అధిష్ఠానం దూతల రాయబారం
  • టీఆర్‌ఎస్‌లోకి వెళితే నష్టపోతారని సూచన
  • గతంలో వెళ్లిన వారి పరిస్థితి చూడాలన్నట్లు సమాచారం
టీఆర్‌ఎస్‌లో చేరే అంశంపై ఇంకా తానేమీ నిర్ణయం తీసుకోలేదని తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. ఆయనను పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యతను తాజా ఎన్నికల్లో ఓటమిపాలైన తుమ్మల నాగేశ్వరరావుకు టీఆర్‌ఎస్‌ పెద్దలు అప్పగించారని రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. మంత్రి పదవి ఆఫర్‌తో సండ్ర పార్టీ మారనున్నారన్న వార్తలు ఇటీవల జోరుగా షికారు చేస్తున్న నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం పెద్దలు కొందరు ఆయనను కలిసి చర్చించినట్లు సమాచారం.

పార్టీ సండ్రకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే నష్టాలు, ఇప్పటికే పార్టీ మారిన వారి పరిస్థితి ఎలా ఉందన్న అంశాలను ఆయనకు వివరించినట్లు తెలిసింది. జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నది ఎన్నికల్లో వెల్లడైందని, ఈ పరిస్థితుల్లో తాత్కాలికంగా మంత్రి పదవి వరించినా భవిష్యత్తు రాజకీయం సమాధి అవుతుందని వివరించినట్లు తెలుస్తోంది. పార్టీ పెద్దల సూచనలపై స్పందించిన ఎమ్మెల్యే సండ్ర టీఆర్‌ఎస్‌లో చేరాలని తనకు ఆహ్వానం అందిన మాట వాస్తవమే అయినా వెళ్లాలా? వద్దా? అనే అంశంపై ఇంకా తేల్చుకోలేదని చెప్పి పంపేసినట్లు సమాచారం.

కాగా, పార్టీ మారుతారని భావిస్తున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పార్టీ అధినేత చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చుకున్నారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ మారేది లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సండ్ర అంశం కూడా ఒకటి రెండు రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం ఒడిశా, ఢిల్లీ టూర్లో ఉన్న కేసీఆర్‌ తిరిగి వచ్చాక వీరి వాస్తవ నిర్ణయం ఏమిటన్నది బయటపడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల అంచనా.
Khammam District
sattupalli
sandra venkata veerayya

More Telugu News