Chandrababu: ఆ రోజున సంబరాలు స్టాప్ చేసి.. నిరసనలు స్టార్ట్ చేయండి: చంద్రబాబు పిలుపు

  • జనవరి 1 సంబరాలు బంద్ చేయండి 
  • ప్రజలు రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేయాలి
  • ఐక్యత చాటి బీజేపీ గుండెల్లో గుబులు రేపాలి
ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన బీజేపీ, దానికి సహకరిస్తున్న ఇతర పార్టీల గుండెల్లో వణుకు పుట్టేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఇందుకోసం జనవరి 1న కొత్త సంవత్సరం వేడుకల స్థానంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ భారీగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

సాధారణంగా కొత్త సంవత్సరం రోజున సంబరాలు చేసుకుంటామని, అయితే, కేంద్రం చేసిన అన్యాయంపై ఈసారి జనవరి 1న గళమెత్తాలని సూచించారు. రాష్ట్రం నుంచి గ్రామ స్థాయి వరకు ప్రజలు కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఎవరికి వీలైన సమయంలో వారు రెండు మూడు కిలోమీటర్ల మేర  నిరసన ర్యాలీలు నిర్వహించాలని కోరారు. అయితే, ఇది పార్టీల పరంగా కాకుండా ప్రజలే ముందుకొచ్చి ర్యాలీలు నిర్వహించాలని కోరారు.

రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ర్యాలీలు నిర్వహించాలని చంద్రబాబు కోరారు. తొలుత ఒకరు నిరసన తెలిపితే వారి వెంట కలిసి వచ్చే వాళ్లు మరికొందరు ఉంటారని, అలా అది ప్రవాహంగా మారుతుందని అన్నారు. అన్యాయం జరుగుతున్నా చూస్తూ కూర్చుంటే పదేపదే అదే మోసానికి గురి  కావాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.
Chandrababu
Andhra Pradesh
New year
Januaray 1st
BJP

More Telugu News