Jagan: జగన్ పై హత్యాయత్నం కేసు.. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు హైకోర్టు కీలక ఆదేశాలు!

  • కేసును ఎన్ఐఏ కు బదిలీ చేయాలా? వద్దా?
  • జనవరి 4లోగా అభిప్రాయాన్ని చెప్పండి
  • కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై ఆమధ్య విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడి ఘటనపై ఏపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. జగన్ దాఖలుచేసిన పిటిషన్ ను ఈ రోజు విచారించిన కోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ఈ కేసును ఎన్ఐఏ కు బదిలీ చేయడంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రం, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించింది.

ఈ విషయాన్ని 2019, జనవరి 4వ తేదీలోగా తమకు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు ఆదేశాలు జారీచేసిన ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 4కు వాయిదా వేసింది. జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో ఈ ఏడాది అక్టోబర్ 25న దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న జగన్ హైదరాబాద్ లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటున్నారు.

More Telugu News