KCR: కేసీఆర్ మనవడి పెద్దమనసు.. అభాగ్యుడికి ఆపన్న హస్తం!

  • దివ్యాంగుడిని ఆదుకునేందుకు ముందుకొచ్చిన హిమాన్షు
  • అతడి పరిస్థితి తెలుసుకుని చలించిపోయిన కేసీఆర్ మనవడు
  • పూర్తిస్థాయిలో ఆదుకుంటామని హామీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు ఓ ఆపన్నుడికి చేయూత అందించేందుకు ముందుకొచ్చారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి పుష్కర కాలంగా మంచానికే పరిమితమైన వ్యక్తిని ఆదుకున్నారు. అంతేకాదు, తాత కేసీఆర్‌తో మాట్లాడి బాధితుడికి పూర్తి స్థాయిలో సాయం అందించాలని నిర్ణయించుకున్నారు.
 
12 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో భద్రాచలానికి చెందిన నూకసాని శ్రీనివాసరావు వెన్నుపూసకు తీవ్ర గాయమైంది.  అప్పటి నుంచి మంచానికే పరిమితమైన శ్రీనివాస్ ఇటీవల మూడు చక్రాల సైకిలుపై తిరుగుతున్నాడు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడిన మాటలు యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి. కేసీఆర్ మూడు వేల పింఛన్ ఇవ్వకున్నా పర్వాలేదని, ఇప్పుడిస్తున్న దానితోనే తమ కడుపు నిండుతోందని, మళ్లీ కేసీఆరే సీఎం కావాలని అన్నాడు.

తాజాగా, ఈ వీడియోను చూసిన హిమాన్షు భద్రాచలంలో తమకు తెలిసిన వారి ద్వారా శ్రీనివాస్ వివరాలను తెప్పించుకున్నారు. అతడి పరిస్థితి గురించి తెలుసుకుని చలించిపోయారు. అతడికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అవసరం అనుకుంటే హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన హామీ మేరకు శ్రీనివాసరావు చికిత్స కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. హిమాన్షు పెద్ద మనసుకు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తాత కేసీఆర్‌తో మాట్లాడి పూర్తిస్థాయిలో సాయం అందించేందుకు కృషి చేస్తానని హిమాన్షు తమతో చెప్పినట్టు శ్రీనివాస్ భార్య తెలిపారు.
KCR
Himanshu
Bhadradri Kothagudem District
Hospital
Telangana

More Telugu News