నడి రోడ్డుపై వలపు వల... మాటువేసి పట్టేసిన గుంటూరు పోలీసులు!
- జాతీయ రహదారిపై నిలబడే యువతులు
- బుట్టలో పడిన వారిని పక్కకు తీసుకెళ్లి దోపిడీ
- ముగ్గురు యువతులు సహా ఏడుగురి అరెస్ట్
గుంటూరు సౌత్ జోన్ డీఎస్పీ మూర్తి వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఓ టీమ్ గా ఏర్పడిన ఏడుగురు ఈ దోపిడీలకు పాల్పడుతున్నారు. ఆడవారిని చూసి వాహనాన్ని ఆపే డ్రైవర్లు, ఇతర వాహనదారులు వీరి టార్గెట్. దీని గురించి తెలుసుకున్న పోలీసులు, సోమవారం తెల్లవారుజామున చినకోండ్రుపాడు కాటూరి మెడికల్ కాలేజీ వద్ద మాటు వేశారు. ఆ దిశగా వచ్చే వాహనాలను పరిశీలిస్తున్నారు. తన్నీరు అంకమ్మరావు అనే వ్యక్తి, తన ఆటోలో కాటూరి వైపు వెళుతుండగా ఒక్కసారిగా యువతులు రోడ్డుపైకి వచ్చి చెయ్యెత్తారు. తమను చూసి ఆశపడ్డ అంకమ్మరావును వారు పక్కకు తీసుకెళ్లగానే, పురుషులు వచ్చి దాడి చేసి రూ. 4,750 నగదు, సెల్ ఫోన్ ను లాక్కున్నారు.
దీన్ని చూస్తున్న పోలీసులు మెరుపుదాడి చేసి, వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరంతా 25 సంవత్సరాల లోపు వయసువారే కావడం గమనార్హం. రహదారిపై రాత్రిపూట దోపిడీలు చేస్తున్న వీరిని చితల దుర్గా ప్రసాద్, దొడ్డా రాజకుమార్, వేముల అనిల్, జీ ఏసుబాబు, షేక్ మాబులా, అంగడి లక్ష్మి, వంతల తిరుపతమ్మ గా గుర్తించామని తెలిపారు. వీరు గతంలో సత్తెనపల్లి, పేరేచర్ల, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లోనూ ఇదే తరహా దోపిడీలు చేసినట్టు గుర్తించామన్నారు. నిందితులను రిమాండ్ కు పంపామని వెల్లడించారు.