Manmohan Singh: మీడియాతో మాట్లాడడానికి నేనెప్పుడూ భయపడలేదు: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

  • ‘చేంజింగ్ ఇండియా’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మన్మోహన్
  •  తానెప్పుడూ మీడియాతో టచ్‌లోనే ఉన్నానన్న మాజీ ప్రధాని
  • పరోక్షంగా మోదీపై విసుర్లు
మీడియాతో మాట్లాడడానికి తానెప్పుడూ భయపడలేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ‘చేంజింగ్ ఇండియా’ పేరుతో రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన మన్మోహన్ మాట్లాడుతూ..  మీడియాతో మాట్లాడడానికి తానెప్పుడూ భయపడలేదని, తాను అటువంటి ప్రధానిని కానని స్పష్టం చేశారు. ప్రెస్‌తో క్రమం తప్పకుండా టచ్‌లోనే ఉండేవాడినని అన్నారు.

విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు, వచ్చిన తర్వాత ప్రతిసారి మీడియాతో మాట్లాడానని గుర్తు చేశారు. ‘‘నేను మీడియాతో మాట్లాడడానికి భయపడే ప్రధానిని కాను’’ అని పరోక్షంగా మోదీని ఉద్దేశించి అన్నారు. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదు.

తాను నిర్వహించిన మీడియా సమావేశాలకు సంబంధించిన విషయాలను కూడా పుస్తకంలో ప్రస్తావించినట్టు మన్మోహన్ పేర్కొన్నారు. ఐదు భాగాలుగా ఉన్న ‘చేంజింగ్ ఇండియా’ పుస్తకంలో ఆర్థికవేత్తగా తన జీవితం, ప్రధానిగా పదేళ్ల పదవీకాలానికి సంబంధించిన పలు విషయాల గురించి పేర్కొన్నారు.

‘‘ప్రజలేమో నన్ను మౌన ప్రధానిగా అభివర్ణిస్తుంటారు. కానీ ఇప్పుడీ పుస్తకంలోని ప్రతీ పేజీ వారి కోసం మాట్లాడుతుంది. ప్రధానిగా నేను సాధించిన విషయాల గురించి చెప్పి ఆత్మస్తుతి చేసుకోవాలనుకోలేదు. అయితే, జరిగిన వాటి గురించి మాత్రం చక్కగా వర్ణించగలిగా’’ అని మన్మోహన్ పేర్కొన్నారు.
Manmohan Singh
Prime Minister
Narendra Modi
afraid
Changing India

More Telugu News