Telangana: తెలంగాణలో ఎన్నికల ఇంక్ తగిలి బొబ్బలెక్కిన చర్మం.. భయపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు!

  • మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో ఘటన
  • పలువురు ఉద్యోగుల చేతులకు బొబ్బలు
  • స్పందించిన చర్మ వైద్య నిపుణులు

తెలంగాణ ఎన్నికల సందర్భంగా రోజంతా కష్టపడిన ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు మరో కొత్త తలనొప్పి మొదలైంది. ఎన్నికల సందర్భంగా ఓటర్ల చేతికి వేసే ఇంకు తగలడంతో తమ చేతులకు బొబ్బలు వచ్చేశాయని పలువురు ఉద్యోగులు వాపోయారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఈ విచిత్రమైన అనుభవం ఎదురయింది.

ఈ నెల 7న పోలింగ్ సందర్భంగా కొందరు ఉద్యోగుల చేతులు, మోచేయి, వేళ్లకు సిరా తగిలింది. అయితే సాధారణ ఇంక్ అని భావించిన ఉద్యోగులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ సాయంత్రం కల్లా ఇంక్ తగిలిన ప్రాంతంలో చర్మం కాలిపోయినట్లు కమిలిపోయి ఊడిపోయింది. చాలామందికి చేతులు, కాళ్లకు బొబ్బలు వచ్చేశాయి. దీంతో భయాందోళనలకు లోనైన ఉద్యోగులు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు.

ఈ విషయమై డెర్మటాలజిస్ట్ ఒకరు స్పందిస్తూ.. ‘మనం తలకు పెట్టుకునే హెయిర్‌ డైలో పారా ఫిలిమన్‌ డయేమైన్‌(పీపీడీ) ఉంటుంది. ఇది రెండు శాతానికి తక్కువ ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. ఎక్కువ మోతాదులో ఉంటే శరీరంలో ఎలర్జీ ఉన్న వాళ్లలో కొందరికి పడదు. ఓటరు వేలికి పెట్టే సిరాలో ఉండే ఇదే తరహా రసాయనం కారణంగా కొందరికి బొబ్బలొచ్చి చర్మం ఊడిపోతుంది. ఈ బొబ్బలకు భయపడాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు.

More Telugu News