India: రాజస్తాన్, ఛత్తీస్ గఢ్ సీఎం అభ్యర్థులపై ప్రశ్నించిన మీడియా.. తెలివిగా తప్పించుకున్న సోనియాగాంధీ!

  • మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ పేరు ఖరారు
  • రాజస్తాన్ లో పైలెట్, గెహ్లాట్ పోటీ
  • పార్లమెంటులో సోనియాకు మీడియా ప్రశ్న

మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో అధికార బీజేపీని కాంగ్రెస్ ఓడించిన సంగతి తెలిసిందే. బీజేపీతో హోరాహోరీగా తలపడ్డ కాంగ్రెస్ చివరికి విజయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ను పార్టీ చీఫ్ రాహుల్ ఎంపిక చేశారు. కాగా రాజస్తాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ సారథులు ఎవరో ఇంకా స్పష్టత రాలేదు. ఈ రెండు రాష్ట్రాల్లో కాబోయే సీఎం అభ్యర్థులు ఎవరో కొందరు విలేకరులు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని డైరెక్టుగా అడిగేశారు. పార్లమెంటు వద్ద ఈరోజు ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

అయితే విలేకరుల ప్రశ్నకు సోనియా టెన్షన్ పడకుండా నింపాదిగా స్పందిస్తూ..‘ఈ విషయమై దయచేసి రాహుల్ గాంధీనే అడగండి’ అని తెలివిగా జవాబిచ్చి తప్పించుకున్నారు. గతేడాది డిసెంబర్ 11న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన కొత్తల్లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాలను కాంగ్రెస్ కోల్పోయినప్పటికీ, తాజా విజయాలతో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంది. రాజస్థాన్‌లో సీఎం రేసులో ప్రస్తుతం సచిన్ పైలెట్, అశోక్ గెహ్లాట్ ఉన్నారు.

More Telugu News