kuna venkatesh gowd: టీడీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లి పరామర్శించిన తలసాని శ్రీనివాస్ యాదవ్

  • కూన వెంకటేష్ గౌడ్ ఇంటి వద్ద హంగామా చేసిన తలసాని అనుచరులు 
  • విషయం తెలుసుకుని కూన ఇంటికి వెళ్లిన తలసాని
  • మరోసారి ఇలా జరగకుండా చూస్తానంటూ హామీ
సనత్ నగర్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్ గౌడ్ పై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నిన్న సాయంత్రం బేగంపేటలోని వెంకటేష్ గౌడ్ ఇంటి వద్దకు వెళ్లిన తలసాని అనుచరులు కొందరు టపాసులు పేల్చడంతో పాటు, అసభ్యంగా దూషించారు. దీనిపై టీడీపీ నేతలు పోలీసులకు సమాచారం అందించడంతో... వారు అక్కడ నుంచి పరారయ్యారు. అయితే, దీన్ని వీడియో తీసిన టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోను కేటీఆర్ కు కూడా పంపారు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న తలసాని నిన్న రాత్రి 8 గంటల సమయంలో బేగంపేటలోని బ్రాహ్మణవాడీలో ఉన్న వెంకటేశ్ గౌడ్ నివాసానికి స్థానిక కార్పొరేటర్ తరుణితో కలసి వెళ్లారు. వెంకటేష్ గౌడ్ ను సముదాయించారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. తమ వారు హంగామా చేసిన సంగతి తనకు తెలియదని, వారిని తాను మందలిస్తానని, మరోసారి ఇలా జరగకుండా చూస్తానని తెలిపారు. కూన కుటుంబసభ్యులతో కూడా ఆయన కాసేపు మాట్లాడారు.
kuna venkatesh gowd
Talasani
TRS
Telugudesam
sanath nagar

More Telugu News