Karnataka: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వని తల్లి.. పెట్రోల్ పోసి నిప్పంటించిన కసాయి కొడుకు!

  • కర్ణాటకలోని బెంగళూరులో ఘటన
  • మద్యానికి బానిసైన ఉత్తమ్ కుమార్
  • గాలింపు ప్రారంభించిన పోలీసులు
మద్యం తాగేందుకు తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో ఓ కుమారుడు రాక్షసుడిగా మారాడు. తన దగ్గర నగదు లేదని ఆమె చెప్పడంతో కన్నతల్లి అన్న విచక్షణ కోల్పోయాడు. వద్దురా.. అంటూ ప్రాధేయపడుతున్నా వినకుండా పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.

నగర శివార్లలోని సదాశివనగర్ ప్రాంతానికి చెందిన ఉత్తమ్ కుమార్ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన ఉత్తమ్.. పనికిపోకుండా ఇంట్లోవాళ్లను డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. తాజాగా మందు తాగేందుకు డబ్బులు లేకపోవడంతో తల్లి వద్దకు వచ్చిన ఉత్తమ్, నగదు ఇవ్వాలని కోరాడు. అయితే తన దగ్గర డబ్బులు లేవని ఆ పెద్దావిడ జవాబు ఇచ్చింది. దీంతో ఆగ్రహానికి లోనయిన సదరు ప్రబుద్ధుడు సమీపం నుంచి పెట్రోల్ ను తీసుకొచ్చి తల్లిపై చల్లాడు.

వద్దురా.. అని ఆమె తీవ్రంగా ప్రాధేయపడ్డా వినకుండా నిప్పంటించాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. మంటల్లో చిక్కుకున్న బాధితురాలి అరుపులు విన్న చుట్టుపక్కలవారు వెంటనే వాటిని అర్పి ఆసుపత్రికి తరలించారు. కాగా, మంటల్లో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ప్రస్తుతం చికిత్స పొందుతోంది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు, పరారీలో ఉన్న ఉత్తమ్ కోసం గాలింపు ప్రారంభించారు.
Karnataka
banglore
liquor
addict
mom
petrol
torched
Police

More Telugu News