Telangana: తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్... మద్యం అమ్మకాలపై నిషేధం!

  • రేపు ఉదయం 6 గంటల నుంచి అమలు
  • బుధవారం ఉదయం 6 గంటల వరకూ 
  • హద్దుమీరితే కఠిన చర్యలన్న కొత్వాల్ అంజనీకుమార్
అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ ను విధించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంలో భాగంగానే 144 సెక్షన్‌ విధించినట్టు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం ఉదయం 6 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, దీంతో నలుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడటం నిషేధమని అన్నారు.

ఇదే సమయంలో మద్యం అమ్మకాలనూ నిషేధిస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలను నిషేధించినట్టు అధికారులు తెలిపారు. కల్లు దుకాణాలు, అన్ని బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, మిలటరీ క్యాంటీన్లకు ఇది వర్తిస్తుందని అన్నారు. ఇక ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు జరిపితే కఠిన చర్యలుంటాయని పోలీసు అధికారులు హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చరాదని, పరిమితికి మించి శబ్దం చేసే వారిపైనా చర్యలుంటాయని అన్నారు.
Telangana
Wines
Bars
144 Section
Hyderabad
Anjani Kumar

More Telugu News