america: అమెరికాలో నాటి హత్య ఘటన..తల్లిని గొంతునులిమి చంపానన్న కొడుకు

  • 2015 నవంబరులో నార్త్ కరోలినాలో ఘటన
  • పిజ్జా ఆర్డర్ చేయడంపై ప్రశ్నించిన తల్లిని హతమార్చాడు
  • కోర్టులో అసలు విషయం చెప్పిన కొడుకు 
2015 నవంబరులో అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో తెలుగు మహిళ నళిని తేలప్రోలు (51) హత్యకు గురైన దారుణ ఘటన గుర్తుండే ఉంటుంది. తన తల్లిని తానే హత్య చేశానని ఆమె తనయుడు తాజాగా కోర్టు ముందు అంగీకరించాడు. పిజ్జా ఆర్డర్ చేసిన విషయమై తమ మధ్య జరిగిన గొడవ నేపథ్యంలోనే తన తల్లిని గొంతు నులిమి చంపేసినట్టు కొడుకు ఆర్నవ్ ఉప్పలపాటి చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.

ఈ సంఘటన జరిగినప్పుడు ఆర్నవ్ వయసు పదహారేళ్లు. చదువుపై అంతగా ఆసక్తి లేని అతనికి సరదాగా గడపడమంటే మాత్రం ఇష్టం. ఆ రోజున తన తండ్రి వ్యాపార పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో పిజ్జా కోసం ఆర్నవ్ ఆర్డర్ చేశాడు. ఈ క్రమంలో తల్లి నళినీకి కోపం రావడంతో, వారి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో, కొడుకును చెంపపై కొట్టింది.

దీనికి తట్టుకోలేకపోయిన ఆర్నవ్, తన సరదాలకు అడ్డుతగులుతోందని భావించి ఆమె గొంతు నులమడంతో ప్రాణాలు విడిచింది. నిర్జీవంగా పడిఉన్న తల్లిని ఆసుపత్రికి తీసుకెళదామనుకున్న ఆర్నవ్, ఆమెను కారులోకి ఎక్కించలేక అక్కడే వదిలేశాడు. అప్పుడు ఆర్నవ్ వయసు పదహారేళ్లు కావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేయకుండా వదిలేశారు.

అయితే, ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు, గత ఏడాది అభియోగాలు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఆర్నవ్ ని కోర్టు ముందు హాజరు పరచడంతో తన తల్లిని ఎందుకు చంపాల్సి వచ్చిందో చెప్పాడు. ఈ కేసులో ఆర్నవ్ కు పన్నెండు నుంచి పదిహేను ఏళ్ల జైలు శిక్ష పడుతుందని తెలుస్తోంది.
america
north karolina
arnav uppalapati
nalini telaprolu

More Telugu News