Sumalatha: భర్త మరణం తరువాత తొలిసారిగా సుమలత భావోద్వేగ పోస్ట్!

  • మీరు చూపిన ప్రేమ ధైర్యాన్నిచ్చింది
  • మాండ్య ప్రజల ప్రేమ మాటల్లో వర్ణించలేనిది
  • ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
ప్రముఖ నటి సుమలత భర్త, ప్రముఖ నటుడు అంబరీశ్ ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణం తరువాత తొలిసారిగా సుమలత నేడు సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ తన వరుస ట్వీట్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. వరుసగా మూడు రోజుల పాటు పోలీసు అధికారులు, జిల్లా అధికారులు చాలా కష్టపడ్డారని ఆమె పేర్కొన్నారు.

‘ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి కష్టకాలంలో మీరు చూపిన ప్రేమ, సానుభూతి మాకు ధైర్యాన్ని ఇచ్చాయి. అంబరీశ్‌కు ఘనంగా వీడ్కోలు చెప్పిన కర్ణాటక ప్రజలకు, అభిమానులకు నేను, నా కుమారుడు అభిషేక్, అలాగే అంబరీశ్ కుటుంబం మొత్తం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. అంబరీశ్‌ను అమితంగా అభిమానించిన మాండ్య ప్రజల ప్రేమ మాటల్లో వర్ణించలేనిది. అంబరీశ్‌ను గౌరవిస్తూ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేసిన కర్ణాటక ప్రభుత్వానికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.

అంతిమ వీడ్కోలు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చూసేందుకు వరుసగా మూడు రోజులు పోలీసు అధికారులు, జిల్లా అధికారులు చాలా కష్టపడ్డారు. అంబరీశ్‌ ఓ నటుడు, సూపర్‌స్టార్‌, కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రి, చాలా మందికి స్నేహితుడు. అన్నింటికీ మించి మీ స్వచ్ఛమైన ప్రేమను పొందిన వ్యక్తి. ఆయన ఈ పుణ్యభూమి కర్ణాటకలో పుట్టే అదృష్టం చేసుకున్నారు. ఆయన మాండ్యకు కుమారుడిలాంటి వారు’ అంటూ సుమలత భావోద్వేగంతో ట్వీట్ చేశారు.
Sumalatha
Ambareesh
Social Media
Karnataka
Abhishek

More Telugu News