Telangana: లోకేశ్ కోసమే సుహాసినిని బలి చేస్తున్నారు.. నిజంగా అంత ప్రేముంటే ఏపీలో మంత్రిని చేయొచ్చుగా!: కేటీఆర్

  • ఆమెను రాజకీయంగా సమాధి చేయబోతున్నారు
  • జగన్ దాడి ఘటనపై మనిషిగా స్పందించా
  • కూకట్ పల్లి సభలో మంత్రి కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగినప్పుడు ఓ మనిషిగా, స్నేహితుడిగా స్పందించానని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. తాను ట్విట్టర్ లో స్పందిస్తే కేసీఆర్, మోదీ, అమిత్ షా, కాంగ్రెస్ కలిసి తనపై కుట్ర చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారని పేర్కొన్నారు. అదే చంద్రబాబు ఈరోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మరోసారి ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని జోస్యం చెప్పారు. కూకట్ పల్లిలో ఈ రోజు కాపు సామాజికవర్గం నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

ప్రాంతం, జాతి, కులం, మతం ఆధారంగా తమ ప్రభుత్వం వివక్ష చూపలేదనీ, అందరిని కడుపులో పెట్టుకుని కాపాడుకున్నామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో విద్యుత్ కోత అన్నది లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చాలా తెలివైనవారనీ, అందుకే నందమూరి సుహాసినిని కూకట్ పల్లిలో పోటీకి దింపారన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేశ్ కు ఎవ్వరూ అడ్డు రాకూడదన్న కుట్రతోనే సుహాసినిని ఓడిపోయే కూకట్ పల్లి స్థానంలో పోటీ చేయిస్తున్నారని ఆరోపించారు. ఆమె రాజకీయ జీవితాన్ని సమాధి చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. నిజంగా నందమూరి కుటుంబంపై చంద్రబాబుకు అంత ప్రేమ ఉంటే ఏపీలో లోకేశ్ కు ఇచ్చినట్లే సుహాసినికి సైతం మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Telangana
KTR
Andhra Pradesh
TRS
Chandrababu
Telugudesam
KCR
NANDAMURI
SUHASINI
Jagan
attack
Nara Lokesh

More Telugu News