Canada: దోపిడీ దొంగలు, నగల షాపు సిబ్బంది మధ్య కత్తి యుద్ధం.. తోకముడిచిన దొంగలు!

  • నగల షాపులోకి చొరబడేందుకు దొంగల విశ్వప్రయత్నం
  • కత్తులతో అడ్డుకున్న సిబ్బంది
  • తుపాకులు చూపించినా బెదరని వైనం
దోపిడీ దొంగలకు, నగల షాపు సిబ్బందికి మధ్య జరిగిన కత్తియుద్ధానికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. నిజానికి దోపిడీ దొంగలు చుట్టుముట్టినప్పుడు పోలీసులకు ఫోన్ చేయడమో, లేదంటే వారి బారి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడడమో చేస్తారు. అయితే, వీరు మాత్రం అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ఎదురొడ్డారు. తుపాకులు చూపించి భయపెట్టాలని చూసినా వెనక్కి తగ్గలేదు. దీంతో దొంగలు వెనక్కి తగ్గక తప్పలేదు.

కెనాడలోని మిస్సిసాగాలో అశోక్ జువెల్లర్స్‌లో ఈ ఘటన జరిగింది. పట్టపగలే నగల షాపు వద్దకు వచ్చిన దొంగలు చుట్టూ ఉన్న గ్లాస్ ప్యానెల్‌ను బద్దలు గొట్టి లోపలికి రావాలని ప్రయత్నించారు. పెద్దపెద్ద సుత్తులతో అద్దాలను బద్దలుగొట్టారు. ఇది చూసిన సిబ్బంది లోపలికి వెళ్లి కత్తులు తీసుకొచ్చి సిద్ధమయ్యారు. అప్పటికే లోపలికి వచ్చిన ఓ దొంగ సిబ్బంది చేతిలోని కత్తులు చూసి వెనక్కి గెంతాడు.

మళ్లీ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించాడు. సిబ్బంది కత్తులతో వారిపైకి ఎగబడ్డారు. వారు తమ చేతిలో ఉన్న పెద్ద సుత్తులతోపాటు తుపాకులు చూపించి భయపెట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని సిబ్బంది కత్తులతో వారిపైకి దూకడంతో చేసేది లేక దొంగలు తోకముడిచారు. ఈ ఘటన మొత్తం షాపులోని సీసీటీవీలో రికార్డు అయింది. ఇప్పుడది బయటకు వచ్చి విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియోను చూసిన వారు నగల షాపు సిబ్బంది ధైర్య సాహసాలకు అభినందించకుండా ఉండలేకపోతున్నారు.
Canada
Ashok Jewellers
Mississauga
robbery

More Telugu News