Rahul Gandhi: కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు చేతులు కలపడానికి కారణం ఇదే: రాహుల్ గాంధీ

  • తెలంగాణ ప్రజల కలలను టీఆర్ఎస్ కల్లలు చేసింది
  • ఓ వ్యక్తి తనకు తోచిన విధంగా దుర్మార్గపు పాలనను కొనసాగించారు
  • నాలుగున్నరేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడుదాం
తెలంగాణపై ఎంత ప్రేమ ఉందో సోనియాగాంధీ మీ వద్దకు వచ్చి తెలియజేశారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ కోసం మీరు పోరాడుతున్నప్పుడు... సోనియా మీవైపు నిలబడ్డారనే విషయం మీ అందరికీ తెలుసని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకే ఈ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. మీ పోరాటాలతో పాటు సోనియా సంకల్పంతో తెలంగాణ ఏర్పాటయిందని చెప్పారు.

టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడబోతున్నామని తెలిపారు. ఈ నిరంకుశ పాలనను కూల్చేందుకు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు చేతులు కలిపాయని చెప్పారు. ఏ కలలతో తెలంగాణను తెచ్చుకున్నామో, ఆ కలలను కల్లలు చేసిన టీఆర్ఎస్ ను ఇంటికి సాగనంపుదామని తెలిపారు.

తనకు తోచిన విధంగా వ్యవహరిస్తూ ఓ వ్యక్తి దుర్మార్గపు పాలన కొనసాగించారని కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్క వ్యక్తి కోసమో ఏర్పడలేదని... ప్రజలందరి కోసం ఏర్పడిందని చెప్పారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా, అందరి బతుకులు బాగుపడేలా పరిపాలన కొనసాగిస్తామని తెలిపారు. మహాకూటమికి చెందిన ఈ సభకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. కూటమిలోని నాలుగు పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలిపారు.
Rahul Gandhi
Sonia Gandhi
TRS
congress
Telugudesam
tjs
cpi
kcr

More Telugu News