cm kcr: ‘మీ ఊళ్లోకొచ్చి మిమ్మల్ని కొట్టిపోతా’ అంటూ చంద్రబాబు మళ్లీ వస్తున్నాడు!: సీఎం కేసీఆర్

  • చంద్రబాబు నాయుడు అవసరమా మనకు?
  • బాబుని భుజాల మీద మోసుకొచ్చింది ఎవరు?
  • కష్టపడి తెలంగాణ తెస్తే మళ్లీ ఆయనకు అప్పగిస్తారా?
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు గుప్పించారు. నల్గొండ జిల్లా దేవరకొండలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, ‘చంద్రబాబు నాయుడు అవసరమా మనకు? ఇవాళ.. చంద్రబాబునాయుడిని భుజాల మీద మోసుకొచ్చింది ఎవరు? ఇంత కష్టపడి, చచ్చీచెడీ, దీక్షలు బట్టి.. తెలంగాణను తెస్తే.. మళ్లీ ఆయనకు అప్పజెబుతారా? అప్పజెబుదామా?’ అంటూ ప్రశ్నించారు. ఓట్ల రూపంలో ప్రజలు తమ చైతన్యం చూపించాలని, మహాకూటమిని ఓడించాలని పిలుపు నిచ్చారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టొద్దంటూ కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు మళ్లీ ఇక్కడికి వస్తున్నాడని మండిపడ్డారు.

‘అదే చంద్రబాబునాయుడు ‘మీ ఊళ్లోకొచ్చి మిమ్మల్ని కొట్టిపోతా, మీ ఇంట్లో కొచ్చి మిమ్మల్ని కొట్టిపోతా’ అంటూ కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకుని మళ్లీ వస్తున్నాడు. వచ్చేటోడు ఆంధ్రోడు.. తెచ్చేటోడు తెలంగాణోడు. ఇది న్యాయమా? ఇది తెలంగాణ ఆత్మగౌరవమా? దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. తెలంగాణకు జీవన్మరణ సమస్య ఇది. వాళ్ల పెత్తనాన్ని మళ్లీ ఒప్పుకుంటే గోల్ మాల్ చేస్తారు తప్ప, మోసం చేస్తారు తప్ప  మనకు సాయం చెయ్యరు. దయచేసి, ఆ ఇబ్బందులు రానీయొద్దు.. అప్రమత్తంగా ఉండాలి’ అని ప్రజలను కోరుతున్నానని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
cm kcr
Chandrababu
devarakonda
TRS
Telugudesam

More Telugu News