TRS: టీఆర్ఎస్ కు ఓటేయండి: నిర్మల్ లో అర్ధరాత్రి అసదుద్దీన్ బహిరంగ సభ

  • టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి
  • నిర్మల్ కు రాకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ చూసింది
  • రూ. 25 లక్షలు ఇస్తామని ఆఫర్ చేసింది
  • ఫోన్ రికార్డులు ఉన్నాయన్న అసదుద్దీన్
నిర్మల్ పట్టణంలో గత అర్ధరాత్రి ఎంఐఎం భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో మాట్లాడిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తనను నిర్మల్ సభకు రాకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ నేతలు చూశారని, తనకు ఫోన్ చేసి, ఈ సభకు వెళ్లకుండా ఉంటే రూ. 25 లక్షలు ఇస్తామని బేరం పెట్టారని నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఆఫర్ కు సంబంధించిన ఫోన్ కాల్ రికార్డు తన వద్ద ఉందని ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు వాటిని బహిర్గతం చేస్తానని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనైతిక పొత్తులు పెట్టుకుని ప్రజలను మోసం చేయాలని నిర్ణయించుకుందని వ్యాఖ్యానించిన ఆయన, ప్రజలు కాంగ్రెస్, టీడీపీల కలయికలో ఏర్పడిన ప్రజా కూటమికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తనను ఎవరూ కొనలేరని, ప్రజలు కూడా మోసపోరాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు.
TRS
MIM
Asaduddin Owaisi
Telangana

More Telugu News