India: భారత అడ్వర్టైజింగ్ పితామహుడు ఆల్కే పదంసి కన్నుమూత!

  • అనారోగ్యంతో బాధపడుతున్న పదంసి
  • ప్రఖ్యాత యాడ్ల రూపకల్పన
  • రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సంతాపం
భారత అడ్వర్టైజింగ్ పితామహుడిగా గుర్తింపు పొందిన ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ ఆల్కే పదంసి(90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కుటుంబ సభ్యుల మధ్య ఈ రోజు తుదిశ్వాస విడిచారు. 1982లో విడుదలైన ‘గాంధీ’ సినిమాలో పోషించిన మొహమ్మద్ అలీ జిన్నా పాత్రతో ఆల్కే పదంసికి మంచి గుర్తింపు లభించింది.

ప్రముఖ యాడ్ ఏజెన్సీ‘లింటాస్ ఇండియా’కు అధిపతిగా పదంసి వ్యవహరించారు. లలితాజీ సర్ఫ్‌, లిరిల్‌ గర్ల్, చెర్రీ చార్లీ షూ పాలిష్‌, హమారా బజాజ్‌ వంటి విశేష ప్రాచుర్యం పొందిన ప్రకటనలను ఆయన రూపొందించారు. దాదాపు 100 బ్రాండ్లకు జాతీయస్థాయిలో ఓ గుర్తింపును తీసుకొచ్చారు. దీంతో ముంబైలోని అడ్వర్టైజింగ్‌ క్లబ్‌ ఆయన్ను ‘అడ్వర్టైజింగ్‌ మెన్‌ ఆఫ్‌ ది సెంచరీ’ అనే బిరుదుతో సత్కరించింది.

ఇక ఆల్కే పదంసి సేవలను గుర్తించిన కేంద్రం 2000లో పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. కాగా, ఆల్కే మృతి పట్ల రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆల్కే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
India
Narendra Modi
Ram Nath Kovind
alkay padamsee
advertisement

More Telugu News