Chandrababu: మనం సాధించిన దాన్నే మోదీ గొప్పగా చెప్పుకుంటున్నారు: చంద్రబాబు

  • మోదీ చెప్పుకుంటున్న గొప్పలన్నీ... మనం సాధించినవే
  • విశాఖలో ఫిన్ టెక్ ను ఏర్పాటు చేసింది మనమే
  • సులభతర వాణిజ్యంలో మనమే నెంబర్ వన్
ప్రధాని మోదీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఏపీకి ఏమాత్రం సహకారం అందించని మోదీ... విదేశీ పర్యటనల్లో మాత్రం ఏపీలో జరిగిన అభివృద్ధిని చెప్పుకుంటూ మైలేజ్ పెంచుకుంటున్నారని విమర్శించారు. భారతదేశంలో ఫిన్ టెక్ నిర్మాణం చేశామని సింగపూర్ లో మోదీ గొప్పగా చెప్పుకున్నారని... విశాఖపట్నంలో ఫిన్ టెక్ ను ఏర్పాటు చేసింది మనమే అని చెప్పారు.

రెండంకెల అభివృద్ధిని సాధించామని జపాన్ లో చెప్పారని... దాన్ని సాధించింది కూడా ఏపీనే అని తెలిపారు. సులభతర వాణిజ్యానికి పెద్ద పీట వేస్తున్నామని చెప్పారని... అందులో కూడా ఏపీనే నెంబర్ వన్ అని చెప్పారు. మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ ది రెండో స్థానమని అన్నారని.. ఈ ఘనతకు కూడా ఏపీనే కారణమని తెలిపారు. ఇస్రో ఘనత గురించి గొప్పగా చెప్పుకున్నారని... రాకెట్ ప్రయోగ కేంద్రం కూడా ఏపీలోనే ఉందని చెప్పారు.

ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలను ఉసిగొల్పి దేశంలో, రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించాలని చూస్తున్నారని... ఎవరు ఎన్ని విధాలుగా భయపెట్టాలని చూసినా, తాను భయపడనని చంద్రబాబు అన్నారు. దేశాన్ని కాపాడేందుకే అన్ని పార్టీలను ఏకం చేస్తున్నామని చెప్పారు. 
Chandrababu
modi
Andhra Pradesh

More Telugu News