Majubhargavi: ఏపీ సీఎం చంద్రబాబుతో సీనియర్ నటి మంజుభార్గవి భేటీ.. త్వరలో టీడీపీలో చేరిక?
- అమరావతిలో చంద్రబాబుతో భేటీ
- పథకాలపై ప్రశంస
- రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు చెమటోడుస్తున్నారన్న సీనియర్ నటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటి మంజుభార్గవి ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అంబికా కృష్ణతో కలిసి అమరావతి వచ్చిన ఆమె చంద్రబాబుతో అరగంటపాటు భేటీ అయ్యారు.
టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని కితాబిచ్చిన ఆమె రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు చెమటోడుస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేశారు. కాగా, త్వరలోనే మంజుభార్గవి టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. పార్టీలో చేరిన వెంటనే ఆమెకు ఏదో ఒక పదవి ఇచ్చేందుకు అధిష్ఠానం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.