Krishna District: బాలికలతో ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. కళ్లలో కారం చల్లి తప్పించుకున్న వైనం

  • కంట్లో కారం చల్లి గ్రామంలోకి పరిగెత్తిన బాలికలు
  • ఓ ఇంట్లోకి దూరి విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు
  • బాలికలు తనను తప్పుగా అర్థం చేసుకున్నారన్న ఆటో డ్రైవర్
తమతో అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్ కళ్లలో  కారం చల్లి బాలికలు తప్పించుకున్న ఘటన కృష్ణా జిల్లా  మచిలీపట్నంలోని పోతేపల్లి శివారులో సోమవారం రాత్రి జరిగింది.  బందరు శివారులో ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటున్న ముగ్గురు బాలికలు వలందపాలెంలోని పాఠశాలలో చదువుకుంటున్నారు.

పాఠశాలకు వెళ్లిన బాలికలను ఆటోడ్రైవర్ ఎప్పటిలాగే రాత్రి ఏడు గంటల సమయంలో హాస్టల్‌ వద్ద దింపేందుకు తీసుకెళ్తున్నాడు. పోతేపల్లి శివారులోకి ఆటో చేరుకున్న తర్వాత ఆటో డ్రైవర్ ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కీడు శంకించిన బాలికలు తమ వద్ద ఉన్న కారాన్ని అతడి కంట్లో కొట్టి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఓ ఇంట్లోకి దూరారు. వారికి విషయం చెప్పడంతో 100 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలికలు తనను తప్పుగా అర్థం చేసుకున్నారని, మూత్ర విసర్జన కోసం ఆటో ఆపితే తప్పుగా భావించి తన కంట్లో కారం చల్లి పరిగెత్తారని ఆటో డ్రైవర్ పోలీసులకు వివరించాడు. కాగా, హాస్టల్ నిర్వాహకులు కూడా ఆటో డ్రైవర్ అటువంటి వ్యక్తి కాదని, చాలా కాలంగా నమ్మకంగా పనిచేస్తున్నాడని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Krishna District
Machilipatnam
Girls
Auto Driver

More Telugu News