Mamata Banerjee: 19న కోల్‌కతాకు చంద్రబాబు.. మమతతో భేటీ!

  • బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే పనిలో చంద్రబాబు
  • ఇప్పటికే పలువురు నేతలతో భేటీ
  • ఎప్పటికప్పుడు మమతతో ఫోన్‌లో మాట్లాడుతున్న సీఎం
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 19న కోల్‌కతా వెళ్లనున్నారు. బీజేపీయేతర పార్టీలను ఏక తాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్న చంద్రబాబు ఇప్పటికే పలువురు జాతీయ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇప్పుడు మమతను కలిసేందుకు వెళ్లనున్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు, సానుకూలతపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. జనవరిలో తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగనున్న భారీ ర్యాలీ, ఢిల్లీలో ఈనెల 22న నిర్వహించనున్న బీజేపీయేతర పక్షాల విందు సమావేశంపైనా భేటీలో చర్చించనున్నట్టు సమాచారం.

ఇటీవల వరుసగా జాతీయ నాయకులతో మంతనాలు జరుపుతున్న చంద్రబాబు, ఆ విషయాలను ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా మమత బెనర్జీకి తెలియజేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా జాతీయ నేతలను కలిసిన విషయంతోపాటు మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామి, స్టాలిన్‌ను కలిసి చర్చించిన విషయాన్ని కూడా ఆమెకు వివరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నేరుగా వెళ్లి ఆమెతో మరిన్ని విషయాలపై చర్చించి కూటమికి తుది రూపురేఖలు తేవాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
Mamata Banerjee
Chandrababu
Andhra Pradesh
West Bengal
BJP
Telugudesam

More Telugu News