Uttar Pradesh: రైల్లో సిగరెట్ తాగొద్దన్నందుకు.. గర్భవతిని చంపేసిన దుండగుడు

  • జలియన్ వాలా ఎక్స్ ప్రెస్ లో దారుణం
  • గర్భవతిపై దాడి చేసిన దుండగుడు
  • ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడిచిన మహిళ
తోటి ప్రయాణికుడిని సిగరెట్ తాగొద్దని చెప్పిన గర్భవతిని ఓ దుండగుడు కిరాతకంగా చంపేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పంజాబ్-బీహార్ జలియన్ వాలా ఎక్స్ ప్రెస్ జనరల్ బోగీలో చినత్ దేవి (45) అనే గర్భవతి తన కుటుంబసభ్యులతో కలసి ప్రయాణిస్తోంది. ఈ సందర్భంగా ఓ తోటి ప్రయాణికుడు బోగీలోనే సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ పొగ వల్ల తాము చాలా ఇబ్బంది పడుతున్నామని... ఆపేయాలని అతన్ని ఆమె కోరింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విచక్షణ కోల్పోయిన ఆ దుండగుడు ఆమెపై తీవ్ర స్థాయిలో దాడి చేశాడు. ఈ నేపథ్యంలో, షాజహాన్ పూర్ రైల్వే స్టేషన్ లో రైలును ఆపి, ఆమెను హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు... అప్పటికే ఆమె మృతి చెందిందని తెలిపారు. నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనపై షాజహాన్ పూర్ లోని జీఆర్పీ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ ఏకే పాండే మాట్లాడుతూ, దుండగుడిని సోనూ యాదవ్ గా గుర్తించామని చెప్పారు. చనిపోయిన మహిళ తన కుటుంబంతో కలసి చాత్ పూజ కోసం బీహార్ వెళుతోందని తెలిపారు. మృతురాలి భౌతికకాయాన్ని పోస్టుమార్టంకు పంపామని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి, విచారిస్తున్నామని తెలిపారు. 
Uttar Pradesh
jalianwala express
smoking
women
attack

More Telugu News