Sarkar: ‘సర్కార్’ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ అరెస్ట్ అయ్యారంటూ వార్తలు.. ఖండించిన పోలీసులు!

  • ‘సర్కార్’ సినిమాలో ప్రభుత్వాన్ని కించపరిచే సన్నివేశాలు
  • ఆందోళనకు దిగిన అధికార పార్టీ కార్యకర్తలు
  • మురుగదాస్ ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు

ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌ ఇంటికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడంతో కలకలం రేగింది. ఆయనను అరెస్ట్ చేయబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందించిన ‘సర్కార్’ సినిమాలో కొన్ని సన్నివేశాలు ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని అధికార పార్టీ నేతలు మండిపతున్నారు.

ఈ విషయంలో ప్రభుత్వం కూడా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు సినిమా విడుదలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల వద్ద దాడికి దిగారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని నేతలు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ నేపథ్యంలోనే పోలీసులు విరుగంబక్కంలోని మురుగదాస్ నివాసానికి చేరుకోవడంతో కలకలం రేగింది. అతడిని అరెస్ట్ చేసేందుకే వారు వచ్చి ఉంటారని అందరూ భావించారు. మురుగదాస్ అరెస్ట్ అంటూ వార్తలు కూడా వెలువడ్డాయి.

అయితే, వాస్తవం అది కాదని తేలింది. సినిమాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంటిపై దాడి జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు భద్రత కల్పించేందుకు వచ్చినట్టు తెలిసింది. అయితే, ఆ సమయంలో దర్శకుడు ఇంటిలో లేకపోవడంతో పోలీసులు వెనక్కి వెళ్లిపోయారని ‘సర్కార్’ సినిమా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై చెన్నై పోలీసులు స్పందించారు. మురుగదాస్‌ను అరెస్ట్ చేసేందుకు తాము రాలేదని, అటువంటి ఉద్దేశం లేదని ట్వీట్ చేశారు.

More Telugu News