Shashi Tharoor: ఏమాత్రం వెనక్కి తగ్గని శశి థరూర్.. ఈసారి మోదీని మరో రకంగా అభివర్ణించిన కాంగ్రెస్ నేత

  • మొన్న శివలింగంపై తేలన్న థరూర్
  • నేడు తెల్లని గుర్రంపై కత్తి పైకెత్తి కూర్చున్న హీరోగా అభివర్ణన
  • థరూర్ పై పరువు నష్టం దావా
ప్రధాని నరేంద్రమోదీ శివలింగంపైన ఉన్న తేలులాంటి వారని అభివర్ణించి విమర్శలపాలైన కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈసారి ఆయనను తెల్లని మగ గుర్రంపై కత్తి పైకి లేపి కూర్చున్న హీరోగా ఎద్దేవా చేశారు. బెంగళూరులో గతవారం జరిగిన లిటరేచర్ ఫెస్టివల్‌లో శశిథరూర్ మాట్లాడుతూ.. ఓ ఆరెస్సెస్ నేత ప్రధాని మోదీని శివలింగంపై కూర్చున్న తేలుతో మోదీని పోల్చారని చెప్పారు. ఆ తేలును చేతితో తీయలేమని, అలాగని చెప్పుతో కొట్టలేమని ఆయన తనతో అన్నట్టు పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

తాజాగా, శనివారం మరోమారు మోదీపై థరూర్ విరుచుకుపడ్డారు. నాకన్నీ తెలుసు అన్నట్టు తెల్లని మగ గుర్రంపై కత్తి పైకెత్తి కూర్చున్న హీరోగా మోదీని అభివర్ణించారు. మోదీ ఒక్కరే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, మిగతావారందరూ ఆయన చెప్పినట్టు ఆడుతున్నారని ఆరోపించారు. కాగా, థరూర్ తేలు వ్యాఖ్యలపై ఢిల్లీలో ఆయనపై పరువునష్టం కేసు నమోదైంది. థరూర్ వ్యాఖ్యలతో ఓ మతం మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు వేసినట్లు బీజేపీ నేత బాబర్ పేర్కొన్నారు.
Shashi Tharoor
Congress
Narendra Modi
BJP

More Telugu News