Rahul Gandhi: ప్రధాని ఎవరనేది అప్రస్తుతం.. మా ఇద్దరి లక్ష్యం ఒక్కటే!: చంద్రబాబు

  • ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడేందుకు చేతులు కలిపాం
  • బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తాం
  • కాంగ్రెస్ తో కలసి దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ పని చేస్తాయి
దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు అందరిపై ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇదే అంశంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, తాను చర్చించామని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీల కలయికపై కొందరికి కొన్ని సందేహాలు ఉన్నాయని... కానీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతోనే తాము కలిశామని చెప్పారు. దేశాన్ని రక్షించడం కోసం చేతులు కలిపామని తెలిపారు.

దేశ ప్రతిపక్ష నేతగా రాహుల్ పైన, దేశంలోని సీనియర్ నేతగా తనపైన దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. బీజేపీని వ్యతిరేకించే అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెస్తామని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. రాహుల్, చంద్రబాబులు గంటకు పైగా భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరూ కలసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఈ మేరకు వ్యాఖ్యానించారు.

దేశంలో ప్రస్తుతం ఏం జరుగుతోందో అందరూ గమనిస్తున్నారని... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేయడమే కాకుండా, కీలక వ్యవస్థలను నాశనం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సీబీఐ, సుప్రీంకోర్టు, ఆర్బీఐలతో పాటు గవర్నర్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని... ఇంతటి దారుణమైన పాలనను తన జీవితంలో చూడలేదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఈ విషయాలపై చర్చించాలని రాహుల్ ను కోరుతున్నానని చంద్రబాబు తెలిపారు. భావసారూప్యత ఉన్న పార్టీలన్నింటితో సమావేశమై... కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో కలసి, ప్రాంతీయ పార్టీలన్నీ కలసి పని చేస్తాయని తెలిపారు. మహాకూటమి అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి ఎవరు? అనే ప్రశ్న అప్రస్తుతమని చెప్పారు. సెన్సేషనల్ వార్తల కోసం మీడియా ప్రయత్నించవద్దని సూచించారు. ప్రత్యేక హోదా కోసం తాము పోరాడుతున్నామని... హోదాకు రాహుల్ మద్దతు పలికారని చెప్పారు.
Rahul Gandhi
Chandrababu
Telugudesam
congress

More Telugu News