Rahul Gandhi: మోదీ నిజంగానే అవినీతిపరుడు: రాహుల్ గాంధీ

  • రాఫెల్‌పై విచారణ మొదలైతే మోదీ జైలుకే
  • అవినీతి జరగలేదనే ఇతర వాదనలకు తావులేదు
  • ఇండోర్‌లో మీడియా సమావేశంలో వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. రాఫెల్ ఒప్పందంలో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి అనుకూలంగా వ్యవహరించేందుకు గానూ నిబంధనలు, చట్టాలను మోదీ అతిక్రమించారని ఆయన మరోసారి ఆరోపించారు. ఒకవేళ రాఫెల్‌ ఒప్పందం విషయంలో ఒక్క పత్రం బయటకు వచ్చినా, మోదీ, అనిల్‌ అంబానీల పేర్లు మాత్రమే బయటకు వస్తాయని బీజేపీ నేతలకు తెలుసన్నారు.

బీజేపీ ముందు ప్రస్తుతం ఉన్న సమస్య ఎన్నికల్లో గెలుపు మాత్రమే కాదని, మోదీని ఈ కేసు నుంచి రక్షించడం కూడా అని విమర్శించారు. కేంద్ర దర్యాప్తు బృందం(సీబీఐ) డైరెక్టర్‌ను తెల్లవారు జామున 2 గంటలకు తొలగించడానికి కారణం ఇదేనని రాహుల్ ఆరోపించారు.
మోదీపై అవినీతి ఆరోపణలు చేయడం కాదని, ఆయన నిజంగా అవినీతిపరుడని అన్నారు. ఈ విషయంలో తికమకపడాల్సిన అవసరం ఏమీ లేదన్నారు.

రాఫెల్ ఒప్పందంలో అవినీతి జరగలేదనే ఇతర వాదనలకు తావులేదన్నారు. ఈ ఒప్పందంపై విచారణ మొదలైతే మోదీ జైలుకి వెళ్లే విషయంపై మాత్రమే ప్రశ్నలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇండోర్‌లో సీనియర్ జర్నలిస్టులతో మీడియా సమావేశంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

శబరిమల వివాదంపై రాహుల్ గాంధీ తన అభిప్రాయం చెబుతూ మహిళలకు పురుషులతోపాటు సమానంగా అన్నీ హక్కులు ఉంటాయి. గుడితోపాటు ఎక్కడికైనా సరే వెళ్లే హక్కువారికి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, ఈ విషయంలో తనకు, తన పార్టీ నేతలకు మధ్య వేర్వేరు అభిప్రాయాలు ఉండొచ్చన్నారు.
Rahul Gandhi
Congress
Narendra Modi
BJP

More Telugu News