Rahul Gandhi: రాఫెల్ ఒప్పందం విచారణ ప్రారంభమవ్వడంతో మోదీ భయపడ్డారు: రాహుల్ గాంధీ

  • సీబీఐ డైరెక్టర్ తొలగింపునకు కారణం ఇదే
  • కుంభమేళా నిర్వహణలో అవినీతి
  • మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఫెల్ ఒప్పందంపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ డైరెక్టర్ విచారణ చేయడం ప్రారంభించే సరికి ఆయన్ను తొలగించారని ఆయన ఆరోపించారు.

కుంభమేళా నిర్వహణ విషయాల్లో అవినీతి జరుగుతోందని కొందరు తనతో చెప్పారని, సీబీఐ విచారణ కోరాలని అనుకున్నామన్నారు. కానీ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సీబీఐ డైరెక్టర్‌ను తొలగిస్తే సీబీఐ ఎలా పనిచేస్తుందని ఆయన ప్రశ్నించారు. శిప్రా నది పరిశుభ్రత గురించి రాహుల్ విమర్శలు చేశారు. నదిని శుభ్రం చేసేందుకు దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేశారు. కానీ నదిలో నీటిని ఒకసారి చూడండి. ఎవరైనా మంత్రి ఆ నీటిని తాగితే కచ్చితంగా అపస్మారక స్థితికి చేరుకుంటారని విమర్శించారు.

సీబీఐ డైరెక్టర్ రాఫెల్ ఒప్పందం ఆరోపణలపై విచారణ ప్రారంభించడంతో భయపడిన చౌకీదార్(మోదీ) సీబీఐ డైరెక్టర్ ను తొలగించారని ఆరోపించారు. చౌకీదారు దేశాన్ని దోచుకుంటున్నట్టు ఇప్పుడు అందరికీ తెలుస్తోందన్నారు.

తన పర్యటనలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని లక్నో చేరుకున్న రాహుల్ గాంధీ మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2010లో ఒకసారి ఈ ఆలయానికి వచ్చిన రాహుల్ ఈరోజు రెండోసారి ఇక్కడకు వచ్చారు. ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ రెండు రోజులపాటు మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు.
Rahul Gandhi
Congress

More Telugu News