paruchuri: 'ఈ కథకు పరుచూరి బ్రదర్స్ కావలసిందే' అని చిరంజీవి గారు అన్నారట!: పరుచూరి గోపాలకృష్ణ

  • చిరంజీవి 'రచ్చ' కథ విన్నారు
  • మార్పులు చేర్పులు చెప్పారు 
  • మాటలు మమ్మల్ని రాయమన్నారు  
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో 'రచ్చ' సినిమాను గురించి ప్రస్తావించారు. "సంపత్ నంది ఈ సినిమాకి కథ .. స్కీన్ ప్లే .. దర్శకత్వం చేశాడు. సంపత్ నంది ఈ సినిమా కథను చిరంజీవిగారికి వినిపిస్తే ఆయన కొన్ని మార్పులు .. చేర్పులు చెప్పారట. అయితే ఈ కథపై పరుచూరి బ్రదర్స్ కూర్చుంటే బాగుంటుందనీ .. డైలాగులు వాళ్లు రాస్తారులే అని నిర్మాతలతో కూడా చిరంజీవిగారు అన్నారట.

'డైలాగ్స్ నేను రాసుకోగలనండీ .. పరుచూరి బ్రదర్స్ అవసరమా?' అని నిర్మాతలతో సంపత్ నంది అనడంతో, వాళ్లు ఆయన మాటను కాదనలేకపోయారు. మార్పులు చేర్పులు చేసుకుని మళ్లీ చిరంజీవిగారి దగ్గరికి వెళ్లి వినిపించారు. వినగానే చిరంజీవి గారు 'స్క్రిప్ట్ మీద పరుచూరి బ్రదర్స్ కూర్చోలేదా?' అని అడిగారట. దాంతో నిర్మాతలు జరిగింది  చెప్పారు.

అప్పుడు చిరంజీవిగారు 'చూడు సంపత్ .. నువ్వే చేసుకోవాలంటే మాత్రం మరో కథ చెప్పు. ఇది 'ఘరానా మొగుడు' తరహా కథ .. 'ఘరానా మొగుడు'కి వాళ్లు రాశారు గనుక, ఈ కథకు పరుచూరి బ్రదర్స్ కావలసిందే' అన్నారు. అప్పుడు ఈ కథ మా దగ్గరికి వచ్చింది" అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు.      
paruchuri
sampath nandi

More Telugu News