Punjab: హైదరాబాద్ లో పంజాబీ గాయనిని సజీవదహనం చేసిన ప్రియుడిని అనూహ్యంగా పట్టేసిన పోలీసులు!

  • సజీవదహనానికి గురైన సానియా
  • ప్రియుడు సల్మానే నిందితుడని గుర్తించిన పోలీసులు
  • ఐఎస్ సదన్ చౌరస్తాలో పట్టివేత
పంజాబ్ నుంచి హైదరాబాద్ కు పొట్టపోసుకునేందుకు వచ్చి, ఓ ఆర్కెస్ట్రా గ్రూపులో గాయనిగా, వివాహాది శుభకార్యాల్లో ప్రదర్శనలు ఇస్తూ, సజీవదహనానికి గురైన సానియా బేగం (25) కేసులో నిందితుడు అనూహ్యంగా పట్టుబడ్డాడు. ఈ కేసులో సానియాతో సహజీవనం చేస్తున్న సంతోష్‌ నగర్‌ ఒవైసీ కాలనీకి చెందిన షేక్‌ సల్మాన్‌ (27) నిందితుడని గుర్తించిన పోలీసులు గురువారం ఉదయం నుంచే అతని కోసం గాలించారు.

ప్రియురాలి కాళ్లూ, చేతులను ప్లాస్టిక్ వైర్లతో కట్టేసి, దారుణంగా కాల్చి చంపిన సల్మాన్, ఆపై పారిపోగా, అతను గతంలో తిరిగిన ప్రాంతాలను గుర్తించిన పోలీసులు అక్కడ మఫ్టీలో కాపుకాశారు. ఈ క్రమంలో ఐఎస్‌ సదన్‌ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతనే తాము వెతుకుతున్న సల్మాన్ అని పోలీసులు గుర్తించేందుకు ఎంతో సమయం పట్టలేదు.

 సల్మాన్ ను అదుపులోకి తీసుకున్నామని, అతన్ని రిమాండ్ కు తరలించామని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో రెండు రోజుల్లోనే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులకు రివార్డులు అందించనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.
Punjab
Singer
Saniya Begum
Salman

More Telugu News