smruthi irani: అలాంటి వాటిని స్నేహితుల ఇంటికైనా తీసుకెళ్తామా? అలా చేయం గదా?: స్మృతి ఇరానీ

  • వ్యక్తుల ఇంగిత జ్ఞానంపై ఆధారపడి ఉన్న అంశమిది
  • దేవుడు ఉండే చోటుకి అలా వెళ్లడం ఎందుకు?
  • రెహానా ఇరుముడిలో సానిటరీ న్యాప్ కిన్లు ఉన్నాయన్న ఆరోపణలపై స్మృతి ఇరానీ స్పందన

శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించేందుకు యత్నించడాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తప్పుబట్టారు. మహిళల శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై తాను కామెంట్స్ చేయాలనుకోవడం లేదంటూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆలయంలోకి ప్రవేశించాలని చూసిన మహిళా కార్యకర్త రెహానా ఫాతిమా తన ఇరుముడిలో సానిటరీ న్యాప్ కిన్లను తీసుకువెళ్లారనే ఆరోపణల నేపథ్యంలో ఆమె స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

ఈ విషయం కేవలం వ్యక్తుల ఇంగిత జ్ఞానంపై ఆధారపడి ఉన్న అంశమని అభిప్రాయపడ్డారు. రుతుస్రావ సమయంలో వాడిన సానిటరీ న్యాప్ కిన్లను కనీసం స్నేహితుల ఇంటికైనా తీసుకెళ్తామా? అలా చేయం గదా? అని అన్నారు. మరి, దేవుడు ఉండే చోటుకి అలా వెళ్లడం ఎందుకని ప్రశ్నించిన ఆమె, ఈ విషయం గురించి ఆలోచిస్తే మంచిదని సూచించారు.

 ప్రతిఒక్కరికీ దేవుడిని పూజించే హక్కు ఉంటుంది కానీ, హక్కుల పేరిట అసభ్యంగా ప్రవర్తించడం సబబు కాదని అన్నారు. ఇదిలా ఉండగా, రెహానా ఫాతిమాపై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో తేలకముందే కేంద్ర మంత్రి హోదాలో ఉన్న స్మృతి ఇరానీ ఈ వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్న విమర్శలు వస్తున్నాయి.     

More Telugu News